26, మార్చి 2011, శనివారం

నా తెలంగాణ


గాయపడ్డ కన్నీళ్ళు


రెప్పల కమురు వాసన


బొట్లు బొట్లుగా


రాలిపడుతున్న మాంసం ముద్దలు


ఉదయించని సూర్యుని ఫై


వేళాడుతున్న స్వప్నం


నా తెలంగాణ


మోదుగు పువ్వులో


నలతగా పొడుస్తున్న


చంద్రుని ముఖానికి


ఎరుపుని అలికి


సాగనంపిన తల్లి


నా తెలంగాణ



చిరుగాలి పెదవులఫై


మొలకెత్తిన పాలకంకి


ఎద్దు గిట్టల కింద


నెత్తురు కక్కిన వేళ


జమ్మి చెట్టు ఫై


నిద్రిస్తున్న కొడవళ్ళకు


యుద్ధం నేర్పిన నేల


నా తెలంగాణ



సప్త వర్ణాల బతుకమ్మ


రోడ్డు మీద నిలిచి


చుక్కలను అరచేత పట్టి


రెక్క విప్పిన తెలంగాణాను


గొంతెత్తి పిలిచింది



బొడ్డు మల్లెల మునివేళ్ళఫై


ఊహల ఉయ్యాలలో


ఉద్యమాన్ని ముద్దాడిన


యవ్వనపు కలలను


చిగురిస్తున్న వసంతానికి


క్యాంపస్ లే సాక్ష్యం


- - - - - - - - - - -


అసంపూర్ణ వాక్యంలా


సీక్వెన్స్ లేని నిద్రలా


పూర్తి కానీ ఈ కవితలా


అరవై వసంతాల


తెలంగాణ కల ఫలించనే లేదు


4 కామెంట్‌లు:

గోదారి సుధీర చెప్పారు...

"జమ్మి చెట్టు పై నిద్రిస్తున్న కొడవళ్ళకు యుద్ధం నేర్పిన నేల నా తెలంగాణా "ఎంత బాగా చెప్పారు కాశీం ! మీ వ్యాసాలకోసం ఎదురు చూస్తున్నాం .మీ వంటి నిబద్దత గల మేధావులు బ్లాగ్ లోకంలో అడుగు పెట్టడం సంతోష దాయకం

udaya చెప్పారు...

వ్యాఖ్యం సంపూర్ణమవుతుంది .కవిత పూర్తవుతుంది .జై తెలంగాణా .

Afsar చెప్పారు...

కాశీం గారు:
కవిత బాగుంది. చరిత్రని కవిత్వీకరించడం ఎలాగో చెప్పారు.

అఫ్సర్

Bolloju Baba చెప్పారు...

బొడ్డు మల్లెల మునివేళ్ళఫై
ఊహల ఉయ్యాలలో
ఉద్యమాన్ని ముద్దాడిన
యవ్వనపు కలలను
చిగురిస్తున్న వసంతానికి
క్యాంపస్ లే సాక్ష్యం

extraordinary - really really extraordinary -

అస్థిత్వవాద కవిత్వాలలో శుష్కవచనం ఉంటుందన్న నా అభిప్రాయాలను కుప్పకూల్చేశారు మీ ఈ కవితతో....

అభినందనలతో

భవదీయుడు
బొల్లోజుబాబా